India: ఒక్కసారిగా రూ. 4 పెరగనున్న పెట్రోలు ధర... కర్ణాటకం ఫలితమే!
- 19 రోజుల పాటు ధరలను సవరించని ఓఎంసీలు
- కర్ణాటకల ఎన్నికలు జరుగుతున్నందునే
- రూ. 500 కోట్ల నష్టం
- ఒకేసారి భర్తీ చేసుకునే ఆలోచనలో చమురు కంపెనీలు
నేడో రేపో పెట్రోలు, డీజిల్ ధరలు ఏకంగా రూ. 4 చొప్పున పెరగనున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా, నిత్యమూ పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతుంటే, ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించిన కేంద్రం, దాదాపు ఇరవై రోజుల పాటు ధరలను సవరించని సంగతి తెలిసిందే. ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నష్టాల్లోకి జారిపోయే ప్రమాదం ఏర్పడింది.
దీంతో ధరలను పెంచాలని ఓఎంసీలు నిర్ణయించగా, అందుకు కేంద్రం నుంచి అంగీకారం వచ్చినట్టు తెలుస్తోంది. తమకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు లీటరు పెట్రోలుపై రూ. 3.50 నుంచి రూ. 4 వరకూ, లీటరు డీజిల్ పై రూ. 4 నుంచి రూ. 4.55 వరకూ ధరలు పెరగనున్నట్టు సమాచారం. గత నెల 24వ తేదీ నుంచి ఈ నెల 13 వరకూ రోజువారీ ధరల మార్పు లేకపోవడంతో చమురు సంస్థలకు రూ.500 కోట్లకు పైగా నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.