Telangana: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
- ఇంజనీరింగ్ విభాగంలో 78.24 శాతం ఉత్తీర్ణత
- ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ విభాగంలో 90.72 శాతం ఉత్తీర్ణత
- జూన్ 8 నాటికి తొలి విడత కౌన్సెలింగ్ పూర్తవుతుంది
- తొలి విడత కౌన్సెలింగ్ రోజే సీట్లు కేటాయిస్తాం
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొంచెం సేపటి క్రితం ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విభాగంలో 78.24 శాతంతో 1,06,646 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ విభాగంలో 90.72 శాతంతో 60,651 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందినట్టు చెప్పారు.
మే 25 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని, జూన్ 8 నాటికి తొలి విడత కౌన్సెలింగ్ పూర్తవుతుందని చెప్పారు. తొలి విడత కౌన్సెలింగ్ రోజే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. జులై తొలి వారంలో రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుందని, జులై 16 నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు గణనీయంగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా కడియం శ్రీహరి ప్రస్తావించారు.