Congress: విశ్వాస పరీక్షకు ముందే సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్
- మా ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ తిరిగి వచ్చారు
- ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు
- కాంగ్రెస్కు ద్రోహం చేయరు
కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే 207 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయగా మిగతా వారు అసెంబ్లీ తిరిగి ప్రారంభం అయ్యాక చేయాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్ష జరగనుంది. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గే అవకాశం లేదని బీజేపీ భావిస్తోంది.
కనపడకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ బెంగళూరులోని గోల్డ్ఫించ్ హోటల్లో ఉన్నట్లు పోలీసులకు తెలియడంతో వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ విషయంపై మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శివ కుమార్.. తమ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ తిరిగి వచ్చేశారని, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఆయన కాంగ్రెస్కు ద్రోహం చేయరని వ్యాఖ్యానించారు. అలాగే విశ్వాస పరీక్షకు ముందే సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారని శివ కుమార్ పేర్కొన్నారు.