yeddyurappa: ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు దక్కకపోవడం దురదృష్టకరం: యడ్యూరప్ప
- సిద్ధరామయ్య ప్రజలకు కన్నీరు పెట్టించారు
- తాను కన్నీళ్లు తుడుద్దామనుకున్నా
- తుదిశ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టినప్పటికీ... వారికి సేవ చేసే భాగ్యం తమకు దక్కకుండా అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనను చూసి కర్ణాటక ఓటర్లు తమకు 104 సీట్లు ఇచ్చారని చెప్పారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ లు ఏకమయ్యాయని మండిపడ్డారు. సిద్ధరామయ్య పాలనలో ప్రజలకు కన్నీరు పెట్టించారని... తాను మాత్రం ప్రజల కన్నీటిని తుడుద్దామనుకున్నానని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రసంగిస్తే ఆయన ఈ మేరకు వ్యాఖ్యనించారు.
లక్ష రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆదేశించానని యడ్డీ అన్నారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లను పెంచాలనుకున్నానని చెప్పారు. కానీ తన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. తమకు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నందుకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమను ఆహ్వానించారని చెప్పారు. కర్ణాటకపై ప్రధాని మోదీ ఎన్నడూ వివక్ష చూపలేదని అన్నారు. తన తుదిశ్వాస వరకు కన్నడ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.