modi: మోదీకి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టే!: కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ
- ఈరోజు భారతీయులంతా గర్వించదగ్గ రోజు
- సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని బతికించింది
- కర్ణాటక సంఘటన మోదీ, అమిత్ షా ద్వయానికి చెంపపెట్టు
- వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విమర్శలు గుప్పించారు. ఈరోజు భారతీయులంతా గర్వించదగ్గ రోజని, సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని బతికించిందని అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి కర్ణాటక సంఘటన చెంపపెట్టు వంటిదని అన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను మోదీకి కౌంట్ డౌన్ గా భావిస్తున్నామని అన్నారు. కర్ణాటకలో అధికార పీఠం కోసం పాకులాడిన బీజేపీ, చివరి నిమిషం వరకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు విఫలయత్నం చేసిందని, విధిలేని పరిస్థితుల్లో యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారని అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటం హర్షణీయమని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ కుతంత్రాలపై తాము పోరాటం చేయడం, సుప్రీంకోర్టు సకాలంలో స్పందించడంతో కమలనాథుల ఎత్తులు చిత్తయ్యాయని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.