Yeddyurappa: కాంగ్రెస్ ప్లాన్‌కు బీజేపీ చిత్తు.. యడ్డీ రాజీనామాకు కారణమైన మొబైల్ యాప్!

  • బీజేపీ కొంపముంచిన కాల్ రికార్డింగ్ యాప్
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లలో యాప్ ఇన్‌స్టాల్ చేసిన కాంగ్రెస్
  • అడ్డంగా దొరికి అప్రతిష్ఠ పాలైన బీజేపీ

ఈ నెల 15న కర్ణాటక ఫలితాలు విడుదలైనప్పటి నుంచి మొదలైన రాజకీయాలు పలు మలుపులు తిరిగి చివరికి శనివారం ఓ చోటకొచ్చి ఆగాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించినప్పటికీ బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాడి పడేశారు. తగిన బలం లేకపోవడంతో ముందే రాజీనామా చేసేసి వెళ్లిపోయారు. దీంతో జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది.

అంతకుముందు జరిగిన రాజకీయం దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేసింది. బీజేపీకి తగినంత బలం లేకపోవడంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్‌లు చాలా జాగ్రత్త పడ్డాయి. అందివచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నాయి. గవర్నర్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసిన కాంగ్రెస్.. బీజేపీని నైతికంగా దెబ్బకొట్టింది. దీంతోపాటు సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీకి దిమ్మదిరిగే షాకిచ్చింది.

ఫలితాలు వెలువడిన తర్వాత తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ శర్మ ట్రావెల్స్ బస్సులో ఈగిల్టన్ రిసార్ట్‌కు తరలించింది. నిజానికి ఇలా క్యాంపు రాజకీయాలకు తెరతీసేముందు శాసనసభ్యుల మొబైల్ ఫోన్లను తీసేసుకుంటారు. కానీ, కాంగ్రెస్ తెలివిగా వాటిని వారి దగ్గరే ఉంచింది. జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాటిని వారి దగ్గరే ఉంచారు. అయితే, అప్పటికే ఎమ్మెల్యేల ఫోన్లలో కాల్ రికార్డింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారు. దీంతో వారికి వచ్చే ప్రతీ ఫోన్ కాల్ రికార్డు అయింది.

ఇదేమీ తెలియని బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బేరసారాలకు దిగారు. శుక్రవారం రాత్రి రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసనగౌడకు ఫోన్ చేసిన గాలి జనార్దన్‌రెడ్డి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ దీనిని మీడియాకు విడుదల చేసి బీజేపీ కుయుక్తులను బయటపెట్టి తొలి దెబ్బ కొట్టింది. బలపరీక్షకు కొన్ని గంటల ముందు యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర మాట్లాడిన ఆడియో టేప్‌ను బయటపెట్టి మరోసారి కలకలం రేపింది. క్షణాల్లోనే ఈ టేపులు వైరల్ అయ్యాయి. దీంతో బీజేపీ యూటర్న్ తీసుకుంది. శాసనసభలో గందరగోళం చెలరేగితే మరింత అప్రతిష్ఠ పాలవుతామని భావించిన బీజేపీ బలపరీక్షకు ముందే కాడి పడేసింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో రాజీనామా చేస్తున్నట్టు యడ్యూరప్ప ప్రకటించారు. అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.

  • Loading...

More Telugu News