Karnataka: కాంగ్రెస్ నేత పరమేశ్వర్ డిప్యూటీ సీఎం... 20 మంత్రి పదవులు కూడా!: కుమారస్వామి నిర్ణయం
- 30 మంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కుమారస్వామి
- ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
- కాంగ్రెస్ మంత్రుల జాబితాను ఖరారు చేయనున్న రాహుల్ గాంధీ
కర్ణాటకలో సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన తరువాత, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధంగా ఉన్న జేడీఎస్ నేత కుమారస్వామి, ప్రస్తుతం మంత్రివర్గ కూర్పులో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 20 మంత్రి పదవులను ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత జీ పరమేశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామి ఆఫర్ చేయనున్నట్టు సమాచారం.
మొత్తం 30 మంది మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి, ఆ తరువాత వీలును బట్టి మంత్రివర్గాన్ని విస్తరించాలన్న యోచనలో ఉన్నట్టు జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. తమకు మద్దతుగా నిలిచిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని కుమారస్వామి భావిస్తున్నారని తెలిపాయి. ఇక కాంగ్రెస్ తరఫున మంత్రి పదవులకు ఎవరెవరిని సిఫార్సు చేయాలన్న విషయమై నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్, గులాం నబీ ఆజాద్ తదితరులతో కర్ణాటక కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.