Congress: కాంగ్రెస్ ముందు జాగ్రత్త.. జేడీఎస్‌కే సర్వాధికారాలు!
- ఐదేళ్లూ కూటమి అధికారంలో ఉండేలా కాంగ్రెస్ ప్లాన్
- అధికారం కోసం పట్టుబట్టకూడదని నిర్ణయం
- నిర్ణయాధికారం జేడీఎస్‌కే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చినా తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. భవిష్యత్తులో ఎటువంటి లుకలుకలు తలెత్తి ప్రభుత్వం కూలిపోకుండా ఓ పద్దతి ప్రకారం ముందుకెళ్తోంది. అందులో భాగంగా జేడీఎస్‌దే పైచేయి ఉండేలా జాగ్రత్త పడుతోంది. అధికార పంపకాల విషయంలో పట్టుబట్టి రోడ్డున పడకుండా ఉన్నదానితో సరిపెట్టుకోవాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరు చెప్పారు. అనవసర డిమాండ్లకు పోయి కూటమిని అస్థిరపరచాలనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో జేడీఎస్-బీజేపీ కుదుర్చుకున్నట్టు 20:20 నిష్పత్తిలో అధికార పంపకానికి తాము పట్టుబట్టబోమన్నారు.
కాగా, ఇకపై ఎలా పనిచేయాలో కూటమి నేతలందరం కలుసుకుని మాట్లాడుకుంటామని, ఒకసారి మాట్లాడుకుని నిర్ణయించుకున్నాక ఆ విధంగా ముందుకెళ్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి అన్నారు. దళితుడు, లేదంటే ముస్లింను ఉప ముఖ్యమంత్రి పదవిలో నియమిస్తానన్న హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా కేపీసీసీ చీఫ్ జి.పరమేశ్వరను కుమారస్వామి ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతోపాటు కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణ, చాముండేశ్వరిలో సిద్ధరామయ్యను ఓడించిన జీటీ దేవెగౌడ, చామరాజనగర్ నుంచి గెలుపొందిన బీఎస్పీ అభ్యర్థి బి.మల్లేష్లకు కేబినెట్ స్థానాలు ఖాయంగా తెలుస్తోంది.