Karnataka: ఇంకా 'ఆపరేషన్ లోటస్' భయం... ఏ ఎమ్మెల్యేనూ బయటకు వదలని కాంగ్రెస్, జేడీఎస్!
- బీజేపీ ఇంకా రాజకీయం చేస్తుందన్న అనుమానం
- ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు సిద్ధంగా లేని కాంగ్రెస్, జేడీఎస్
- బల నిరూపణ వరకూ క్యాంపుల్లోనే
కర్ణాటకలో సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయగా, ఆపై అదే బాధ్యతలను జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి తరఫున స్వీకరించేందుకు కుమారస్వామి సిద్ధమైనప్పటికీ, బీజేపీ ఏదైనా చేసి, తమ ఎమ్మెల్యేలను లాగేసుకుంటుందన్న అనుమానాలు రెండు పార్టీల్లోనూ తొలగిపోలేదు. దీంతో బెంగళూరులో క్యాంపు రాజకీయాలు సమసిపోలేదు. తమ తరఫునుంచి విజయం సాధించిన ఏ ఎమ్మెల్యేనూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు బయటకు వదిలేందుకు సిద్ధంగా లేవు.
'ఆపరేషన్ లోటస్' భయం ఇరు పార్టీలనూ వెంటాడుతుండగా, ఇంకా శిబిరాల్లోనే ఎమ్మెల్యేలను ఉంచారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, మంత్రివర్గ కూర్పు, ఆపై బలనిరూపణ ముగిసిన తరువాతే ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా తిరగనివ్వాలని ఇరు పార్టీల నేతలూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం హిల్టన్ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, లీ మెరీడియన్ హోటల్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి అవసరమైన సమస్త సౌకర్యాలనూ పార్టీ పెద్దలు హోటల్స్ లోనే సమకూరుస్తున్నారు.