Karnataka: ముందు తమిళనాడుకు, ఆపై ఏపీకి... మొక్కులు తీర్చుకునే పనిలో కుమారస్వామి బిజీ!
- ప్రమాణ స్వీకారానికి ముందే దేవాలయాల సందర్శన
- నేడు తిరుచ్చి శ్రీరంగం ఆలయానికి కుమారస్వామి
- ఆపై తిరుమల దేవదేవుని దర్శనానికి
కర్ణాటకలో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న జేడీఎస్ నేత కుమారస్వామి, ప్రమాణ స్వీకారానికి ముందే పలు దేవాలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. నేడు ఉదయం 10 గంటలకు కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య నేతృత్వంలో నియమించిన సమన్వయ కమిటీ సమావేశం కానుండగా, దీనికి కుమారస్వామి హాజరు కానున్నారు.
ఆ తర్వాత తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచిన హోటల్ కు వెళ్లి, వారితో కాసేపు మాట్లాడనున్న కుమారస్వామి, ఆపై మధ్యాహ్నం నుంచి తన సోదరుడు రేవణ్ణతో కలసి తమిళనాడుకు బయలుదేరి వెళ్లనున్నారు. తిరుచ్చి చేరుకునే ఆయన, శ్రీరంగం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నేరుగా తిరుమలకు కుమారస్వామి వెళతారని జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఢిల్లీకి కూడా వెళ్లాల్సివుండగా, ఈ ఢిల్లీ పర్యటన తిరుమల నుంచి ఉంటుందా? లేక బెంగళూరుకు వచ్చి వెళతారా? అన్నది వీలునుబట్టి ఆయనే నిర్ణయించుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.