TTD: రమణ దీక్షితులు దుర్మార్గుడు, దుష్టుడు: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య సంచలన విమర్శలు
- టీటీడీపై విమర్శలు అర్థరహితం
- బీజేపీకి తొత్తుగా మారి రాజకీయాలు
- స్వామివారి డబ్బును కాజేసిన రమణ
తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఓ దుర్మార్గుడని, దుష్టుడని, అన్య మతస్థుల ఇళ్లకు వెళ్లి పూజలు చేసి వచ్చిన చరిత్ర ఆయనదని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య సంచలన విమర్శలు చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, టీటీడీపై రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలన్నీ అర్థరహితమని అన్నారు. బీజేపీకి తొత్తుగా మారి ఆయన రాజకీయాలు చేయడం ప్రారంభించి, దైవసేవను మరచినందునే ఆయనకు తగిన శాస్తి జరిగిందని అన్నారు.
ఆయన అసందర్భ ప్రేలాపనలను ఎంతమాత్రమూ పట్టించుకోనవసరం లేదని, ఆయన ఓ మహానటుడని, అర్చకులంతా ఆయన్ను వ్యతిరేకిస్తున్న వారేనని అన్నారు. గత మూడేళ్లుగా తిరుమల అర్చకులతో, ఈఓతో, ఉద్యోగులతో గొడవలు పెట్టుకున్నారని గుర్తు చేశారు. నిత్యాన్నదాన పథకానికి వచ్చిన డబ్బును తన సొంత ఖాతాల్లోకి వేయించుకున్న ఘనుడు రమణ దీక్షితులని నిప్పులు చెరిగారు. ఆలయంలోని విలువైన వస్తువులను ఆయన దొంగిలించారని ఆనంద్ సూర్య విమర్శలు గుప్పించారు.