modi: దేశ ప్రజలకు మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి: సీపీఐ రామకృష్ణ
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసేందుకు బీజేపీ చూసింది
- తెలుగు ప్రజలు బీజేపీని ఓడించారు
- పవన్ బస్సుయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నా
కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసేందుకు విఫలయత్నం చేసిన ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో అధికారం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన బీజేపీకి ఆ అవకాశం లేకుండా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా సుప్రీంకోర్టు చేసిందని, కర్ణాటకలోని తెలుగు ప్రజలు బీజేపీని ఓడించారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన బస్సుయాత్ర గురించి ప్రస్తావిస్తూ, ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 21న ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్టణం వరకూ చేపట్టిన రైలుయాత్రకు తమ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30,31 తేదీల్లో గుంటూరు నుంచి అమరావతికి ఆత్మఘోష పాదయాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు.