Karnataka: కాంగ్రెస్-జేడీఎస్ మధ్య పదవుల తగాదా?
- కొత్త మెలిక పెట్టిన కాంగ్రెస్!
- డిప్యూటీ సీఎం పదవి రేసులో డీకే శివకుమార్
- కుమారస్వామి వద్ద ఆర్థికశాఖ, పరమేశ్వరన్ వద్ద హోం శాఖ?
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 23న సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ నేత జి.పరమేశ్వరన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది. ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపై ఇప్పటికే కూటమి నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఎంతో కీలకమైన ఆర్థిక, హోం శాఖలను ఎవరికీ కేటాయించ లేదని, ఆయా శాఖలు కుమారస్వామి, పరమేశ్వరన్ వద్దే ఉంచుకున్నారని సంబంధిత వర్గాల సమాచారం. కుమారస్వామి వద్ద ఆర్థికశాఖ, పరమేశ్వరన్ వద్ద హోం శాఖ ఉంటాయని సమాచారం. డిప్యూటీ సీఎం పదవి రేసులో పరమేశ్వరన్ తో పాటు డీకే శివకుమార్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా, కాంగ్రెస్-జేడీఎస్ మధ్య పదవుల తగాదా షురూ అయినట్టు తెలుస్తోంది. కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ కొత్త మెలికపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. రెండున్నరేళ్ల సీఎం పదవి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, ఈ డిమాండ్ ను జేడీఎస్ ఒప్పుకోవడం లేదనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు హోం శాఖ ఇచ్చేందుకు జేడీఎస్ ఒప్పుకోవడం లేదని మరోకథనం కూడా వినిపిస్తోంది.