Narendra Modi: రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ కానున్న మోదీ
- దాదాపు నాలుగు నుంచి ఆరు గంటలపాటు జరగనున్న భేటీ
- అంతర్జాతీయ పరిణామాలపై చర్చకే ప్రాధాన్యం
భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం నిమిత్తం ఆ దేశ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ ఈరోజు సమావేశం కానున్నారు. సోచీ వేదికగా జరగనున్న ఈ భేటీ దాదాపు నాలుగు నుంచి ఆరు గంటలపాటు సాగే అవకాశమున్నట్టు సమాచారం. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాల కంటే అంతర్జాతీయ పరిణామాలపై చర్చకే ఇద్దరు నేతలు ఎక్కువ ప్రాధాన్యమివ్వనున్నట్టు సమాచారం.
పుతిన్ తో చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయనే విశ్వాసం తనకు ఉందని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, ఇరాన్ తో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న అంశం, ఉగ్రవాద అంశాలు, సిరియా-ఆఫ్గనిస్థాన్ లో నెలకొన్న అశాంతి, షాంఘై సహకార సంస్థల సమావేశం, బ్రిక్స్ సమావేశాలు, ఇతర అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నట్టు సమాచారం.