Karnataka: సిద్ధరామయ్య మాటే నా మాట... రజనీకాంత్ కు గట్టి కౌంటరిచ్చిన కుమారస్వామి!
- కావేరీ నీటిని వదిలే సమస్యే లేదు
- రాష్ట్ర అవసరాలకే నీరు చాలదన్న కుమారస్వామి
- గత ప్రభుత్వ వైఖరే తన వైఖరని స్పష్టీకరణ
కావేరీ నదీ జలాలను దిగువన ఉన్న తమిళనాడుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయాలంటూ, నిన్న రజనీకాంత్ చేసిన విజ్ఞప్తిపై కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి ఘాటుగా స్పందించారు. గతంలో ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పాటించిన విధానాన్నే తాను కూడా పాటిస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి విడుదల సాధ్యం కాదని కౌంటరిచ్చారు. తమ రాష్ట్ర అవసరాలకు సరిపడినంత నీరుంటేనే దిగువకు విడుదల సాధ్యమని, కావాలంటే, రజనీకాంత్, కర్ణాటకకు వచ్చి ఇక్కడి జలాశయాలు, రైతుల పరిస్థితిని చూసి మాట్లాడాలని అన్నారు.
ఆయన్ను తాను ఆహ్వానిస్తున్నానని, ఇక్కడ పరిస్థితిని చూసిన తరువాత కూడా నీరు కావాలని కోరితే, ఆపై చర్చించుకుందామని అన్నారు. కాగా, గతంలో కర్ణాటక నుంచి ప్రతి ఏటా 192 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సి వుండగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కోర్టు దాన్ని సవరిస్తూ 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తీర్పిచ్చింది. ఆ నీరు కూడా ఇచ్చేది లేదంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య భీష్మించుకుని కూర్చోగా, నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.