Chandrababu: ఒకే వేదికపై ఉప్పూనిప్పుల కలయిక.. అందర్నీ ఆకర్షిస్తున్న కుమారస్వామి ప్రమాణ స్వీకార వేడుక!
- రేపటి ప్రమాణ స్వీకారంలో ఒకే వేదికపై ప్రతిపక్ష నేతలు
- రాజకీయ ప్రత్యర్థులంతా ఒకే చోట
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు
పలు ఉత్కంఠ పరిణామాల తర్వాత బుధవారం జేడీఎస్ నేత కుమారస్వామి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖ నేతలు హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేతలు భారీగా హాజరుకానున్న ఈ వేడుక మరో ఆశ్చర్యకర, ఆసక్తికర ఘటనకు వేదిక కానుండడంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లింది.
కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోపాటు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేశ్ యాదవ్, మాయావతి హాజరుకానున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు డైలమాలో ఉన్నారు. అయితే, ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉందనే చెబుతున్నారు.
సరిగ్గా ఇదే ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీకి అన్యాయం చేసిందని వీలుదొరికినప్పుడల్లా కాంగ్రెస్‌పైనా, సోనియాగాంధీపైనా చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించనున్నారు. అలాగే, కేసీఆర్ కనుక హాజరైతే.. ఆయన కూడా సోనియాను పలకరించక తప్పదు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. సోనియా ఒకే వేదికను పంచుకోనున్నారు. అలాగే నిప్పు-ఉప్పులా ఉండే చంద్రబాబు-కేసీఆర్‌లు కూడా విష్ చేసుకోక తప్పని పరిస్థితి.
ఇక ఉత్తరప్రదేశ్‌లో నిన్నమొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఎస్పీ-బీఎస్పీ మధ్య గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల సందర్భంగా మైత్రి కుదిరింది. అఖిలేశ్-మాయావతి పొత్తుపెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వారి పొత్తుతో గోరఖ్‌పూర్‌లో బీజేపీ చిత్తైంది. ఆ తర్వాత అఖిలేశ్ స్వయంగా మాయాను కలిసి అభినందించారు కూడా. వచ్చే ఎన్నికల్లోనూ వీరి పొత్తు కొనసాగే అవకాశాలున్నాయి. అఖిలేశ్-మాయావతి కూడా ఇదే వేదికపై కనిపించనున్నారు. సో.. కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఇంతమంది నేతలను ఒక్క చోటుకి చేరుస్తోంది. అంటే.. రేపు రాజకీయాల్లో సరికొత్త ముఖచిత్రం ఆవిష్కృతం కానుందన్న మాట.