zeneva: అది శ్రీవారిదేనా?... జెనీవాలో వేలానికి వచ్చిన పింక్ డైమండ్ వివరాలివిగో!
- గత సంవత్సరంలో వేలానికి వచ్చిన పింక్ డైమండ్
- అది శ్రీ వెంకటేశ్వరునిదే అంటున్న రమణ దీక్షితులు
- నాణాలు విసిరితే వజ్రం ఎలా పగులుతుందంటున్న నిపుణులు
'డైమండ్స్ ఆర్ ఫరెవర్'... ఎప్పటికీ నిలిచిపోయేది వజ్రం. రూపు మారకుండా, చెక్కు చెదరకుండా ఉండే వజ్రాలు... రూపాయి, రెండు రూపాయిల బిళ్లలు విసిరితే పగులుతాయా? ఇదే ఇప్పుడు తిరుమల శ్రీవారి భక్తుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. 2011 సంవత్సరంలో గరుడోత్సవం నిర్వహిస్తున్న వేళ, ఉత్సవ విగ్రహం మెడలోని ఐదు పేటల ప్లాటినమ్ హారంలో ఉన్న అరుదైన పింక్ డైమండ్ (టీటీడీ చెబుతున్నదాని ప్రకారం ఇది రూబీ మాత్రమే) పగిలిపోయినట్టు రాసి, అధికారులు దాన్ని విదేశాలకు తరలించారని, ఇటీవల దాన్ని జెనీవాలో వేలానికి ఉంచారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జెనీవాలో వేలానికి వచ్చిన పింక్ డైమండ్ వివరాలను పరిశీలిస్తే... గత సంవత్సరం నవంబర్ 15న ఈ వజ్రాన్ని వేలానికి ఉంచారు. దాని యజమాని వజ్రాన్ని దక్షిణాఫ్రికా గనుల నుంచి తీసుకు వచ్చామని క్లయిమ్ చేశారు. ఇక దీని బరువు 36.3 క్యారెట్లు (సుమారు ఇప్పుడున్న మన రూపాయి నాణెమంత వెడల్పులో ఉంటుంది). దాని ఆకారం విషయానికి వస్తే, అది కుషన్ మిక్స్ డ్ కట్ (దీర్ఘ చతురస్రాకారంలో ఉండి, అంచులు కిందకు వెళ్లి ఒకటిగా కలుస్తాయి). ఇక అదే ఆకారంలో రమణ దీక్షితులు చూపిస్తున్న స్వామివారి చిత్రంలోని ప్లాటినమ్ హారం మధ్యలో ఉన్న వజ్రం లేదా రూబీ కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ వజ్రానికి వేలంలో సరైన ధర లభించకపోవడంతో అమ్ముడు పోలేదు.
వజ్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాణాలు విసిరితే పగిలే అవకాశం లేదని, ఏదైనా బలమైన బరువుతో ఓ నిర్ణీత కోణంలో కొడితే, రెండు ముక్కలు కావచ్చేమో తప్ప, ముక్కలు ముక్కలుగా పగలడం అసంభవమని జెమాలజీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అసలు నిజాలను బయట పెట్టాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనంటున్నారు.