kolywood: ప్రియమైన మోదీ గారూ.. ఇప్పటికైనా మౌనం వీడండి!: హీరో విశాల్
- ‘స్టెరిలైట్’ ఘటనలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి
- ఈ ఆందోళన జరిగింది వ్యక్తిగత లక్ష్యాల కోసం కాదు
- నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో ఓ పద్ధతని అన్నారుగా!
- అదే పని ప్రజలు చేశారు..దయచేసి, 2019లో జాగ్రత్త
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తకుడిలో స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని విస్తరించొద్దంటూ ప్రజలు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనపై హీరో విశాల్ స్పందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ‘
ఈ సంఘటనలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి. ఈ ఆందోళన జరిగింది సామాజిక అంశానికి సంబంధించే కానీ వ్యక్తిగత లక్ష్యాల కోసం కాదు. ‘స్టెరిలైట్’ కు వ్యతిరేకంగా సుమారు యాభై వేల మంది ఈ నిరసనలో పాల్గొన్నారంటే దాని అర్థమేంటి! ప్రజా సంక్షేమానికి ఏదైతే వ్యతిరేకమో దానిని నిలువరించేందుకు తూత్తకుడి ప్రజలు ఒక్కటయ్యారని.
ప్రియమైన ప్రధాని, దయచేసి, ఇప్పటికైనా మౌనం వీడండి. నిరసన తెలియజేయడమనేది ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతని బీజేపీ చెబుతోంది. మరి, అదే పని ప్రజలు ఎందుకు చేయకూడదు? ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే.. వేరే దానికోసం కాదు. దయచేసి.. 2019 లో జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నాడు. కాగా, 2019 లో జాగ్రత్త అంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల విషయాన్ని బీజేపీకి పరోక్షంగా విశాల్ గుర్తుచేశాడు.