Bandaru Dattatreya: అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!
- గత రాత్రి గుండెపోటుకు గురైన వైష్ణవ్
- ఆసుపత్రికి తీసుకెళ్లినా దక్కని ఫలితం
- తెల్లారేవరకూ దత్తన్నకు చెప్పని కుటుంబీకులు
తన కుమారుడు వైష్ణవ్ మృతి గురించి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు తెల్లారే వరకూ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డామని, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ పని చేయాల్సి వచ్చిందని దత్తన్న బంధువులు వెల్లడించారు. గత రాత్రి భోజనం చేస్తూ వైష్ణవ్ గుండెపోటుకు గురికాగా, ఆ వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఆపై దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా వైష్ణవ్ ప్రాణాలు దక్కలేదు.
అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో వైష్ణవ్ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించగా, కుమారుడంటే అమితమైన ప్రేమను చూపే దత్తాత్రేయకు ఆ విషయాన్ని చెబితే, ఏమవుతుందోనన్న ఆందోళనలో విషయాన్ని చెప్పలేదు. వైష్ణవ్ మృతదేహాన్ని కూడా తెల్లవారుజాము వరకూ ఆసుపత్రిలోనే ఉంచి, ఆపై ఇంటికి తీసుకెళ్లారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో రోజులాగానే లేచిన దత్తాత్రేయ, విషయం తెలుసుకుని కుప్పకూలిపోయారు.