TTD: టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్లని భక్తులు.. తిరుమలలో టైమ్ స్లాట్ కౌంటర్లు రద్దు!

  • 20 రోజుల వ్యవధిలో 1.40 టోకెన్లు వృథా
  • విధానాన్ని సమీక్షించిన తరువాతే తిరిగి కౌంటర్ల ప్రారంభం
  • వెల్లడించిన టీటీడీ

ఈ నెల ప్రారంభంలో టీటీడీ ప్రారంభించిన టైమ్ స్లాట్ కౌంటర్లను మూసివేశారు. భక్తులకు కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే స్వామి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో, తిరుపతి, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 120కి పైగా కౌంటర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కౌంటర్ల వద్దకు వచ్చి, తాము కోరుకున్న సమయాన్ని తీసుకుని ఆ సమయానికి క్యూలైన్ లోకి వెళ్లే భక్తులు రెండు గంటల వ్యవధిలోనే దర్శనాన్ని ముగించుకుని బయటకు రావచ్చు. ఈ విధానానికి భక్తుల నుంచి మంచి స్పందనే వచ్చింది.

అయితే, టైమ్ స్లాట్ తీసుకున్న భక్తులు దర్శనానికి రావడం లేదని, ఈ కారణంతో ఇతర భక్తులు వేచి చూడాల్సిన సమయం మరింతగా పెరిగిపోతున్నదని ఆరోపిస్తూ ఈ కౌంటర్లను ప్రస్తుతానికి మూసి వేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. మే 3వ తేదీ నుంచి ఇప్పటివరకూ 5,43,308 టికెట్లను జారీ చేయగా, 4,02,011 మంది మాత్రమే దర్శనానికి వచ్చారని అధికారులు తెలిపారు. దాదాపు 1.40 లక్షల మంది టోకెన్ తీసుకుని దర్శనానికి రాలేదని అన్నారు. త్వరలో ఈ విధానాన్ని సమీక్షించి, మార్పు చేర్పులు చేసి, కౌంటర్లను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కాగా, టైమ్ స్లాట్ కౌంటర్ల మూసివేతపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News