thoothukidi: తూత్తుకుడి ప్రజల విజయం... వేదాంత ప్లాంట్ నిర్మాణం ఆపేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం
- విస్తరణపై కేంద్రం సెప్టెంబర్ నాటికి నిర్ణయం తీసుకోవాలి
- అప్పటి వరకూ ప్లాంట్ నిర్మాణం చేపట్టరాదని ఆదేశం
- పర్యావరణ అనుమతులకు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచన
తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత లిమిటెడ్ అనుబంధ సంస్థ స్టెరిలైట్ ఇండస్ట్రీస్ చేపట్టిన కాపర్ స్మెల్టర్ రెండో ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ప్లాంట్ నిర్మాణాన్ని నిరసిస్తూ నిన్న ప్రజలు ఆందోళనకు దిగగా, పరిస్థితులు అదుపుతప్పి పోలీసులు కాల్పులు జరపడం, 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఈ రోజు విచారణ నిర్వహించింది. కాపర్ స్మెల్టర్ ప్లాంట్ ను నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు కోరుతూ వేదాంత తాజాగా కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ పంపాలని ఆదేశించింది. స్టెరిలైట్ విస్తరణ ప్రాజెక్టుపై సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ప్లాంట్ నిర్మాణం చేపట్టరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టెరిలైట్ ఇండస్ట్రీస్ కు ఇక్కడ కాపర్ స్మెల్టర్ పరిశ్రమ ఉండగా, విస్తరణలో భాగంగా మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.