Pawan Kalyan: ధర్మపోరాట యాత్ర పేరిట టీడీపీవి కొత్త డ్రామాలు!: పవన్ కల్యాణ్
- రెండు గంటల మీ ధర్మదీక్షకు 40 లక్షలు ఖర్చు చేశారట
- ఉద్దానం బాధితులకు మాత్రం తాగునీరు అందించలేరు
- ఇచ్చిన హామీలను టీడీపీ నెరవేర్చలేదు
- అందుకే, మళ్లీ ప్రశ్నించడానికి వచ్చా
ధర్మపోరాట యాత్ర పేరిట టీడీపీ కొత్త డ్రామాలాడుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘రెండు గంటల మీ ధర్మదీక్షకు 40 లక్షలు ఖర్చు చేశారట, కానీ ఇక్కడ ఉద్దానం బాధితులకు మాత్రం తాగునీరు అందించలేరు! 2014లో టీడీపీకి ఓటేయమని చెప్పాను. ఇచ్చిన హామీలను వాళ్లు నెరవేర్చలేదు.. అందుకే, మళ్లీ ప్రశ్నించడానికి వచ్చాను. ప్రత్యేకహోదాకు కేంద్రం, టీడీపీలు తూట్లు పొడిచాయి. సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ తాకట్టు పెట్టింది.
ప్రజావ్యతిరేక విధానాల వల్ల తెలంగాణలో టీడీపీ మట్టికొట్టుకుపోయింది. ఆ పరిస్థితి ఏపీలో తెచ్చుకోవద్దు' అంటూ సూచించారు. 'సరికొత్త మార్పు రావాలి. సరికొత్త రాజకీయ చైతన్యం రావాలి. యువతను నేను నమ్ముతున్నాను. 2019కు సరికొత్త రాజకీయ వ్యవస్థ అవసరం. 2019లో మనం అన్ని ప్రాంతాలలో పోటీ చేస్తున్నాం, నన్ను సీఎం చేయాలి అనుకుంటే , మన ఉత్తరాంధ్ర సమస్యలు తీరాలంటే ‘జనసేన’ వెన్నంటే ఉండండి ’ అంటూ పవన్ కోరారు.