Tirumala: తిరుమలలో ఆభరణాల మాయంపై విచారణ జరగాలి: కన్నా లక్ష్మీనారాయణ
- రమణదీక్షితుల ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
- ఈ నెల 26న ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతా
తిరుమలలో ఆభరణాల మాయంపై విచారణ జరగాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను ఢిల్లీలోఈరోజు ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఈ విషయమై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదని అన్నారు.
వజ్రం మాయమవడంపై ప్రభుత్వం రకరకాల వాదనలు చేస్తోందని, భక్తుల అనుమానాలను నివృత్తి చేసేందుకు సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అదే రోజున గుంటూరులో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు.