Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీపై డ్రైవర్ల పిడిగుద్దులు.. కలకలం!
- విధుల నుంచి తొలగించడంతో ఆగ్రహం
- కార్యాలయానికి వచ్చి మరీ దాడి
- గాయపడిన ఈడీ పురుషోత్తం
విధుల నుంచి ఉద్వాసనకు గురైన ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ పురుషోత్తంపై దాడికి దిగడం సంచలనం రేపుతోంది. బుధవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో డ్రైవర్లు కార్యాలయంలోకి వచ్చి పురుషోత్తంపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఈడీ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గమనించిన అటెండర్ వెంటనే పక్కన సమావేశ మందిరంలో ఉన్న డీవీఎంలు, డిప్యూటీ సీటీఎంలకు చెప్పడంతో వారొచ్చి డ్రైవర్లను అడ్డుకున్నారు.
దాడి ఘటనపై పురుషోత్తం మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వైద్య పరీక్ష నిమిత్తం ఈడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన డ్రైవర్లను మేడ్చల్ డిపోకు చెందిన మజర్ అహ్మద్, వేణుగోపాల్, మియాపూర్ రెండో డిపో డ్రైవర్ వీఎన్ రెడ్డిగా గుర్తించారు. మజర్ అహ్మద్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన అధికారులు అతడిని హెచ్‌సీయూ డిపోకు ట్రాన్స్ఫర్ చేశారు. తనను ట్రాన్స్ఫర్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన మజర్.. స్నేహితులైన వేణుగోపాల్, వీఎన్ రెడ్డిలను వెంటబెట్టుకుని జూబ్లీ బస్ స్టేషన్‌కు వచ్చి దాడికి దిగాడు.