TTD: రమణ దీక్షితులుపై టీటీడీ మూకుమ్మడి నిరసన!
- టీటీడీపై సంచలన విమర్శలు చేస్తున్న రమణ దీక్షితులు
- ఆలయ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడుతున్నారంటున్న ఉద్యోగులు
- నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా తొలగించబడిన తరువాత రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలపై టీటీడీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆలయ ప్రతిష్ఠను దిగజార్చేలా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, ఉద్యోగులు మూకుమ్మడి నిరసనకు దిగారు. మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు.
దేవాలయంలో స్వామికి సకాలంలో నైవేద్యం పెట్టడం లేదని, పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరగడం లేదని, స్వామి సంపదను అధికారులు కొల్లగొడుతున్నారని, నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కావాలనే ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు ప్రత్యారోపణలు చేస్తున్నారు.