Telangana: 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా తెలంగాణ.. కొత్త జోనల్ విధానాన్ని ఖరారు చేసిన కేసీఆర్
- ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జోనల్ వ్యవస్థ
- కొత్త జోన్ల విషయంపై రేపు టీజీవో భవన్లో సమావేశం
- అబిప్రాయాలు తెలపనున్న ఉద్యోగులు
ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తెలంగాణలో జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జోనల్ విధానాన్ని ఖరారు చేశారు. ఇక 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా తెలంగాణ ఉండనుంది. 28.29 లక్షల జనాభాతో కాళేశ్వరం జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ జోన్ కింద భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి ఉండనున్నాయి.
39.74 లక్షల జనాభాతో బాసర జోన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ జోన్ కిందికి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల వస్తాయి. 43.09 లక్షల జనాభాతో రాజన్న జోన్ ఏర్పాటు కానుంది. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ ఈ జోన్ కిందికి వస్తాయి. 50.44 లక్షల జనాభాతో భద్రాద్రి జోన్ ఏర్పాటు కానుంది. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఈ భద్రాద్రి జోన్ కిందకు వస్తాయి.
45.23లక్షల జనాభాతో యాదాద్రి జోన్ ఏర్పాటు కానుంది. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ ఈ జోన్ కిందకు వస్తాయి. 1.03 కోట్ల జనాభాతో చార్మినార్ జోన్ ఏర్పాటు కానుంది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఉంటాయి. ఇక 44.63 లక్షల జనాభాతో జోగులాంబ జోన్ ఏర్పాటు కానుంది. ఈ జోన్లో మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ ఉన్నాయి.
ఇక మల్టీ జోన్ల విషయానికి వస్తే 1.61 కోట్ల జనాభాతో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి మల్టీజోన్-1లో ఉంటాయి. మల్టీజోన్-2లో మొత్తం 1.88 కోట్ల జనాభా ఉన్న యాదాద్రి, చార్మినార్, జోగులాంబ ప్రాంతాలు ఉంటాయి.
కొత్త జోన్ల విషయంపై రేపు తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) భవన్లో ఉద్యోగులు సమావేశం అయి చర్చించి, తమ అబిప్రాయాలను తెలంగాణ సీఎస్ ఎస్కే జోషికి వెల్లడించనున్నారు. దీనిపై రూపొందించిన నివేదికను పరిశీలించి తెలంగాణ మంత్రివర్గంలో జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలుపుతారు. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు.