mamata banerjee: మమతా బెనర్జీనా.. మజాకా?.. డీజీపీ నీలమణిపై బదిలీ వేటేసిన కర్ణాటక ప్రభుత్వం!

  • ట్రాఫిక్ నిర్వహణపై నిప్పులు చెరిగిన మమత
  • డీజీపీని వివరణ కోరిన కుమారస్వామి సర్కారు
  • కర్ణాటక తొలి మహిళా డీజీపీ నీలమణిపై బదిలీ వేటు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోపాగ్నికి కర్ణాటక డీజీపీ నీలమణి బలయ్యారు. కర్ణాటక తొలి మహిళా డీజీపీగా చరిత్రకెక్కిన ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెంగళూరు చేరుకున్న మమత విధాన సౌధకు వెళ్లే దారిలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. కారు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో కొంతదూరం నడిచి విధాన సౌధకు చేరుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రాగానే డీజీపీ నీలమణిపై విరుచుకుపడ్డారు. వేదికపైనే డీజీపీకి చీవాట్లు పెట్టారు. అదే ఆవేశంతో దేవెగౌడ వద్దకు వెళ్లి డీజీపీ  తీరుపై ఫిర్యాదు చేశారు. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంటూ మమత చేతులు పట్టుకుని దేవెగౌడ క్షమాపణ కోరారు.

ట్రాఫిక్ నిర్వహణ తీరుపై స్వయంగా ముఖ్యమంత్రి మమత నుంచే ఫిర్యాదు రావడంతో తక్షణం నివేదిక సమర్పించాల్సిందిగా సీఎం కుమారస్వామి డీజీపీని ఆదేశించారు. భారీ వర్షం కారణంగానే సమస్య తలెత్తిందని, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ కార్లు ఒక్కసారిగా విధాన సౌధ ప్రాంగణానికి రావడంతో ఇబ్బంది తలెత్తిందని డీజీపీ తెలిపారు. మమతా బెనర్జీకి జరిగిన అవమానంపై తీవ్రంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం డీజీపీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా నడుచుకుంటూ వేదిక వద్దకు రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News