Karnataka: నేడు కుమారస్వామి బలపరీక్ష... అంతకుముందే అగ్నిపరీక్ష!
- ఈ ఉదయం అసెంబ్లీలో విశ్వాసపరీక్ష
- అంతకన్నా ముందే స్పీకర్ ఎన్నిక
- కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుంటే ప్రభుత్వం పడిపోయినట్టే!
నేడు జేడీఎస్ అధినేత, రెండు రోజుల క్రితం కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి, అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుండగా, అంతకన్నా ముందు ఆయన ఓ అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశం కాగానే, స్పీకర్ ఎన్నిక సాగనుండగా, తమ తరఫున ఓ అభ్యర్థిని రంగంలో నిలుపుతామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ తరఫున నిలబడే స్పీకర్ అభ్యర్థి గెలుపు అంత సులభమేమీ కాదని అంచనా.
బీజేపీకి సభలో 104 మంది సభ్యుల బలం ఉండటం, మెజారిటీకి కేవలం ఏడుగురు సభ్యుల దూరం మాత్రమే ఉండటంతో, జేడీఎస్, కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. స్పీకర్ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సభ్యుడు విజయం సాధించకుంటే, కుమారస్వామి ప్రభుత్వం ఆ క్షణమే సాంకేతికంగా పడిపోయినట్టు భావించాల్సి వస్తుంది.
ఇక కన్నడనాట క్యాంపు రాజకీయాలు ఇంకా సాగుతున్నాయి. బలపరీక్ష ముగిసేంత వరకూ బీజేపీ బేరసారాలు కొనసాగుతూనే ఉంటాయని భావిస్తున్న కుమారస్వామి, సిద్ధరామయ్యలు, తమ ఎమ్మెల్యేలు అందర్నీ ఇంకా హోటళ్లలోనే ఉంచారు. వీరంతా ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి రానుండగా, ఆపై తొలుత స్పీకర్ ఎన్నిక, ఆపై విశ్వాస పరీక్ష జరుగుతుంది. కాగా, ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదని లింగాయత్ లు, మంత్రి పదవులను ఖరారు చేయలేదని పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉండటం, కూటమిలో ఆందోళనను పెంచుతోంది.