Karnataka: కర్ణాటకలో ఇంకా రేసులోనే బీజేపీ.. స్పీకర్ పోస్టు కోసం బీజేపీ ఎమ్మెల్యే నామినేషన్!
- స్పీకర్ పదవి కోసం సురేశ్ కుమార్ నామినేషన్
- కాంగ్రెస్ నుంచి రమేశ్ కుమార్
- పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా బీజేపీని కోరిన డిప్యూటీ సీఎం
అసెంబ్లీలో బలనిరూపణకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ అనూహ్యంగా స్పీకర్ రేసులోకి వచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఎస్.సురేశ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్‌లు స్పీకర్ పదవి కోసం గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నేత అయిన రమేశ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండూ ఆమోదించాయి. 1994-1999 మధ్య ఆయన స్పీకర్‌గా పనిచేశారు కూడా. 1978లో తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్ కుమార్ 1985లో జనతాదళ్‌లో చేరారు. 2004లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
రమేశ్ కుమార్ స్పీకర్ కావడానికి సహకరించాలని డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర బీజేపీని కోరారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పోటీగా ఎవరినీ నిలబెట్టవద్దని అభ్యర్థించారు. అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఉన్న బలం నేపథ్యంలో రమేశ్ కుమార్ ఎన్నిక పెద్ద కష్టం కాదని, నల్లేరు మీద నడకేనని చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ అధిష్ఠానం ఆదేశం మేరకు స్పీకర్ పదవికి పోటీ చేస్తున్నట్టు చెప్పారు. స్పీకర్ పోస్టుకు పోటీ చేయాల్సిందిగా పార్టీ తనను ఆదేశించిందని, పార్టీ నిర్ణయానికి తలొగ్గి పోటీ చేస్తున్నట్టు వివరించారు. కాగా, సురేశ్ కుమార్ 1994 నుంచి ఐదు సార్లు ఎన్నికల్లో గెలుపొందారు.