kumaraswamy: నాకెటువంటి ఆందోళనా లేదు... బలపరీక్ష నెగ్గుతాం: కుమారస్వామి
- ఈ రోజు విధాన సభలో బలపరీక్ష
- 221 మంది సభ్యుల్లో 111 మంది మద్దతు అవసరం
- కాంగ్రెస్ సభ్యులు కొందరు హ్యాండిస్తారన్న ఆశలతో బీజేపీ
- మెజారిటీ నిరూపణ కాకపోతే రాష్ట్రపతి పాలనే!
కర్ణాటకలో ఈ రోజు కుమారస్వామి ప్రభుత్వం శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోనుంది. తొలుత మెజారిటీ శాసన సభ స్థానాల(104)ను గెలుచుకున్న బీజేపీని గవర్నర్ ఆహ్వానించగా, బలపరీక్ష ముందే బీఎస్ యడ్యూరప్ప చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా కుమారస్వామి, ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. మెజారిటీ సభ్యుల మద్దతు నిరూపణ అయితేనే ఈ సర్కారు కొనసాగుతుంది.
ఒకవేళ బలపరీక్ష సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరైనా చేయిస్తే అప్పుడు కుమారస్వామి సర్కారు కూలినట్టే. రాష్ట్రపతి పాలనే శరణ్యం అవుతుంది. నిజానికి కేంద్రంలోని బీజేపీ ఇదే ఆశిస్తోంది. కాంగ్రెస్ సభ్యులు కొంత మంది అయినా కీలకమైన బలపరీక్షలో చేయివ్వకపోతారా అని ఆశగా చూస్తోంది. 221 మంది సభ్యులున్న సభలో కుమారస్వామి సర్కారుకు అనుకూలంగా 111 మంది మద్దతు తప్పనిసరిగా కావాలి. అయితే, బలపరీక్ష విషయంలో తనకెటువంటి ఆందోళన లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. సభలో గెలిచితీరుతామన్నారు. ‘‘నాకు ఆందోళన లేదు. స్పష్టంగా విజయం సాధిస్తాం’’ అని కుమారస్వామి ఈ రోజు ఏఎన్ఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు.