Nipha Virus: తీవ్ర కలకలం... హైదరాబాద్ కు పాకిన నిపా వైరస్?

  • కేరళకు వెళ్లి వచ్చిన హైదరాబాదీ
  • నిపా సోకినట్టు అనుమానం
  • రక్త నమూనాలు సేకరించిన వైద్యులు 
  • ఆందోళన అవసరం లేదన్న మెడికల్‌ ఎడ్యుకేషన్‌

ఇటీవల కేరళకు వెళ్లి వచ్చిన ఓ హైదరాబాదీకి, మరో వ్యక్తికి ప్రాణాంతక నిపా వైరస్ సోకినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాలను నిపా వైరస్ నిర్ధారణ కోసం పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కే రమేష్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం వెల్లడించారు.

తాము ఇప్పటికే కేరళలో నిపా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ఎన్సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) అధికారులతో చర్చించామని తెలిపారు. నిపా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తి కేరళకు వెళ్లి వచ్చాడని, అయితే, వైరస్ ఉన్న ప్రాంతానికి ఆయన చాలా దూరంలోనే ఉన్నారని, వ్యాధి నిర్ధారణకే రక్త నమూనాలు తీసుకున్నామని, పాజిటివ్ గా తేలే అవకాశం తక్కువేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

హాస్పిటల్స్ లో డాక్టర్ల కోసం ప్రొటెక్టివ్ సూట్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే, ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఈ వైరస్ పై అవగాహన పెంచేందుకు ఎన్జీవో సంస్థలు ప్రచారం చేయాలని సూచించారు. చెట్ల నుంచి రాలిపడిన, పక్షులు కొరికిన పండ్లను తినకుండా ఉండాలని కోరారు. కాగా, నిపా బారినపడి ఇప్పటివరకూ 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. నిపా వైరస్ హైదరాబాద్ కు వచ్చిందని సోషల్ మీడియాల్లో ప్రచారం ప్రారంభం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News