Karnool: చెన్నంపల్లి నిధి జాడ కోసం క్షుద్ర మంత్రికులను రంగంలోకి దించిన అధికారులు!
- చెన్నంపల్లి కోటలో గుత్తి రాజుల నిధి ఉందన్న భావన
- శతవిధాలుగా నిధి కోసం అధికారుల ప్రయత్నాలు
- మంత్రగాళ్లు రావడంతో గ్రామస్థుల్లో ఆందోళన
కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లి కోటలో గుత్తి రాజులు దాచి పెట్టారని భావిస్తున్న నిధి కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్న అధికారులు, తాజాగా నిధి ఆనవాళ్లు తెలుసుకునేందుకు క్షుద్ర మంత్రికులను రంగంలోకి దించారు. వారిచ్చిన సలహాలు, సూచనలతో ప్రస్తుతం అధికారులు కోటలో తవ్వకాలు సాగిస్తుండగా, తుగ్గలి వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కోటలో దాదాపు నాలుగు నెలలుగా పలు దఫాలుగా తవ్వకాలు సాగగా, ఇప్పటివరకూ ఆస్థి పంజరాలు, ఏనుగు దంతాలు, మూడు తలలున్న నాగు పడగ శిల్పం, కొన్ని శిల్పాలు, పంచలోహ విగ్రహాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కోటలో వజ్రాలున్నాయని, వర్షాలు పడినప్పుడు అవి బయటకు తేలి కొంతమందికి దొరికాయన్న వార్తలు పలుమార్లు వచ్చిన విషయం తెలిసిందే.