Pakistan: భారతీయ సినిమాలపై సంచలన నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్
- ఈద్ సందర్భంగా బాలీవుడ్ సినిమాలపై నిషేధం
- విదేశీ సినిమాలు ప్రదర్శించకూడదంటూ ఆదేశాలు
- స్థానిక సినిమాలను ప్రోత్సహించేందుకే అన్న పాక్ ప్రభుత్వం
రంజాన్ మాసం సందర్భంగా భారతీయ సినిమాలపై నిషేధం విధిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈద్ కు రెండు రోజుల ముందు నుంచి సెలవులు ముగిసిన రెండు వారాల వరకు భారత్ సహా విదేశాలకు చెందిన ఏ సినిమాను ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అజ సమయంలో ఈ నిషేధం అమల్లో ఉండబోతోంది. ఈ మేరకు సమాచార, ప్రసారాల శాఖలకు పాక్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
పాక్ లోని స్థానిక సినీ పరిశ్రమకు జీవం పోసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన నోటిఫికేషన్ లో పాక్ ప్రభుత్వం పేర్కొంది. నిషేధ సమయంలో కేవలం పాకిస్థాన్ కు చెందిన సినిమాలను మాత్రమే ప్రదర్శించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల వల్ల స్థానిక సినిమాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... తమ సినిమాలను ప్రదర్శించడానికి థియేటర్లు కూడా దొరకడం లేదని పాక్ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నటీనటులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.