savitri: చిన్నప్పటి నుంచి సావిత్రి అంతే .. ఎదుటివాళ్ల కష్టం చూడలేదు: బాల్య స్నేహితురాలు సుశీల
- సావిత్రి .. నేను డాన్సు క్లాసులకి వెళ్లే వాళ్లం
- చాలా దూరం నడవాల్సి వచ్చేది
- రిక్షాలో వెళదామంటే సావిత్రి వద్దనేది
సావిత్రి .. ఆమె చిన్ననాటి స్నేహితురాలు సుశీల ఇద్దరూ కూడా విజయవాడలో కలిసి తిరిగారు .. కలిసి పెరిగారు. సావిత్రి స్టార్ హీరోయిన్ అయినా తన బాల్య స్నేహితురాలైన సుశీలను మరిచిపోలేదు. వీలును బట్టి ఆమెను కలుసుకోవడం .. ఉత్తరాలు రాయడం చేశారు. అలాంటి సుశీల తాజాగా 'వనిత' టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తమ చిన్ననాటి సంగతులను ప్రస్తావించారు.
"డాన్సు క్లాసుల కోసం నేను .. సావిత్రి చాలా దూరం నడవాల్సి వచ్చేది. రిక్షాలో వెళ్లమని సావిత్రికి .. నాకు కూడా ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చేవాళ్లు. అప్పట్లో అక్కడ మనుషులు లాగే రిక్షాలే ఉండేవి. 'ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చారు గదా రిక్షాలో వెళదామా?' అని నేను అడిగితే, 'అదేవిటే పాపం .. వాళ్లూ మనుషులే గదా .. వాళ్లు మనల్ని లాగడమేంటి" అనేది. తాను కూర్చుని వేరేవాళ్లతో రిక్షా లాగించుకోవడం .. టైమైపోతుందంటే రిక్షావాళ్లు రిక్షా లాగుతూ పరిగెత్తడం సావిత్రికి ఇష్టం వుండేది కాదు. వాళ్లు పడే కష్టం చూడలేకనే ఆమె ఆ రిక్షాలు ఎక్కకుండా నడిచేది" అంటూ చెప్పుకొచ్చారు.