Hollywood: 80 మంది హీరోయిన్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన హాలీవుడ్ నిర్మాత అరెస్ట్
- ఎట్టకేలకు లొంగిపోయిన నిర్మాత వీన్‌స్టీన్
- ఎంజెలినా జోలీ, సల్మాహయక్‌లపైనా వేధింపులు
- రూ.6.7 కోట్ల పూచీకత్తుతో బెయిలిచ్చిన కోర్టు
హాలీవుడ్ తారలపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ శుక్రవారం న్యూయార్క్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఒక్కసారిగా ఆయన వార్తల్లోకి ఎక్కాడు. హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు ఏంజెలినా జోలీ, సల్మా హయక్ సహా 80 మందికిపైగా వీన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు. తమను లైంగికంగా వేధించాడని పేర్కొన్నారు. గతేడాదే ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తగా #MeToo ఉద్యమంతో మరింతమంది బయటకు వచ్చారు. హార్వీ తమను రేప్ చేశాడని కొందరు, లైంగిక దాడికి యత్నించాడని కొందరు ఆరోపణలు చేయడం సంచలనమైంది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను వీన్‌స్టీన్ (66) ఖండించాడు.
రేప్, లైంగిక వేధింపులతోపాటు ఇద్దరు మహిళలపై క్రిమినల్ చర్యలకు పాల్పడినట్టు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కాగా, శుక్రవారం ఉదయం 7:25 గంటల ప్రాంతంలో లోయర్ మాన్‌హట్టన్‌లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న నిర్మాత చిన్నగా నవ్వుతూ కనిపించాడు. పోలీసులకు లొంగిపోయిన ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. రూ.6.7 కోట్ల పూచీకత్తుతో వీన్‌స్టీన్‌కు కోర్టు బెయిలు మంజూరు చేసింది.