savitri: ఫ్లాష్ బ్యాక్: నటన పరంగా అక్కినేనికే సలహాలు ఇచ్చిన సావిత్రి!
- అక్కినేని సరసన తొలి ఛాన్స్ పోగొట్టుకున్నారు
- 'దేవదాసు'లో పోటీపడి నటించారు
- ఆ తరువాత మరింతగా రాణించారు
సావిత్రి వీరాభిమానిగా .. ఆమె జీవితంపై అధ్యయనం చేసిన మొదటి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలోని చాలామందికి సంజయ్ కిషోర్ తెలుసు. సావిత్రి జయంతి .. వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకునే కార్యక్రమాలను .. ఫోటో ఎగ్జిబిషన్ లను ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన yoyo టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.
"సినిమాల్లోకి రావడానికి ముందు సావిత్రి .. అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని. అలాంటి సావిత్రికి 'సంసారం' అనే సినిమాలో అక్కినేని సరసన కథానాయికగా ఛాన్స్ వచ్చింది. అయితే నాగేశ్వరరావు గారి సరసన చేయడానికి ఆమె జంకడంతో .. ఆ ఛాన్స్ వేరే వాళ్లకి వెళ్లిపోయింది. అదే సినిమాలో సావిత్రి చిన్న పాత్ర ఒకటి చేశారు.
ఆ తరువాత ఆమె 'దేవదాసు'లో అక్కినేనితో పోటీపడి నటించి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఆ తరువాత పదేళ్లకు అక్కినేనితో 'సుమంగళి' చేస్తూ .. 'గురువు గారూ, ఇక్కడ ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి' అంటూ నాగేశ్వరరావుకే నటనలో సలహాలు ఇచ్చారట. తన కళ్లముందే నటన పరంగా సావిత్రి ఆ స్థాయికి ఎదిగినందుకు నాగేశ్వరరావుగారు ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నాతో చెప్పారు" అన్నారు.