Twitter: ట్విట్టర్ బాస్ కు ల్యాప్ ట్యాప్ కూడా లేదట!
- అన్నీ ఫోన్ పైనే కానిచ్చేస్తా
- వాయిస్ టైపింగ్ టూల్స్ సాయం తీసుకుంటా
- ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడి
ఈ రోజు ట్విట్టర్ జనజీవనంలో భాగమైపోయింది. ఈ సంస్థకు సీఈవోగా జాక్ డార్సీ పనిచేస్తున్నారు. మరి టెక్నాలజీ కంపెనీ బాస్ అయిన ఇతడికి ల్యాప్ టాప్ కూడా లేదంటే నమ్ముతారా..? నిజమేనండి. డార్సీకి ల్యాప్ టాప్ లేదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా జాక్ డార్సీ ఈ విషయాన్ని వెల్లడించారు.
తాను అసలు ల్యాప్ టాప్ ను వాడనని, ఏ పని అయినా తన ఫోన్ నుంచే చక్కబెడతానని చెప్పారు. ఆన్ లైన్ లో ఏ తరహా సెక్యూరిటీ విధానాలను పాటిస్తారన్న ప్రశ్నకు... నోటిఫికేషన్ లను ఆఫ్ చేసి ఒకేసారి ఒక్క అప్లికేషన్ ను మాత్రమే వాడతానని, దాంతో దానిపై దృష్టి పెట్టడం సాధ్యమవుతుందని అన్నారు. మరి ప్రతిదీ మొబైల్ స్క్రీన్ పై టైప్ చేయడం సాధ్యమవుతుందా? అని అడగ్గా... చెప్పింది విని వాయిస్ టైప్ చేసే టూల్స్ ను వాడతానని చెప్పారు. అస్తమానం ఫోన్ పై సమయం గడపకుండా డిజిటల్ కు, వాస్తవ జీవితానికి మధ్య సమతుల్యం పాటిస్తానని చెప్పారు.