NIPAH VIRUS: నిపా వైరస్ కు భయపడిపోవద్దు... శుభ్రత పాటించండి...వైద్యుల సూచనలు!
- తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి
- ఆహార పదార్థాలను సరిగ్గా ఉడికించి తినాలి
- పండ్లను శుభ్రంగా కడుక్కుని తినాలి
- వ్యాధి సోకిన ప్రాంతాలకు వెళ్లితేనే ముప్పు
నిపా వైరస్ దేశవ్యాప్తంగా ప్రజలను భయపెడుతోంది. ఎప్పుడు ఏ రాష్ట్రంలోకి వ్యాప్తి చెందుతుందా అన్న ఆందోళన అయితే ఉంది. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడుతున్నాయి. అయితే, చేతులను తరచుగా సోప్ తో శుభ్రం చేసుకుంటూ, ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత తినడం ద్వారా వైరస్ కు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
నిపా వైరస్ అన్నది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అలాగే, ఇది సోకిన వారి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం కూాడా ఉందని తెలుస్తోంది. మొదటగా మలేషియాలో పందుల పెంపకందార్లలో బయటపడింది. 2001, 2007లో పశ్చిమబెంగాల్ లోని సిలిగురి ప్రాంతంలోనూ వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఎక్కువగా ఒక ప్రాంతం పరిసరాలకే పరిమితమవుతూ వస్తోంది. అంటే బయటపడిన ప్రాంతం, పరిసర ప్రాంతాలకే పరిమితమవుతోంది.
కేరళలోని కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వేనాడ్ జిల్లాలకే ప్రస్తుతం నిపా వైరస్ పరిమితమైంది. దేశంలో మరెక్కడ దీని ఆనవాళ్లు లేవు. ఈ వైరస్ వ్యాధి బారిన పడిన వారి సమీపానికి వెళ్లినప్పుడు ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉందని, వారు ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని కోచిలోని అమ్రిత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్లినికల్ ప్రొఫెసర్ విద్యామీనన్ తెలిపారు.
ఇన్ఫెక్షన్ సోకిన పందులు, గబ్బిలాలు, వాటి విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన వారిలో శ్వాసకోస ఇన్ఫెక్షన్, జ్వరం, వళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తాయి.