southwest monsoon: ముందుగానే పలకరించిన నైరుతి రుతుపవనాలు... అండమాన్ నికోబార్ దీవులకు చేరిక
- నాలుగు రోజుల్లో కేరళకు
- భారీ వర్షాలకు అవకాశం
- జూన్ 1-7 మధ్య ప్రాంతంలో వర్షాలు
- భారత వాతావరణ శాఖ ప్రకటన
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయానికి కంటే ముందే వచ్చేశాయి. దక్షిణ అండమాన్ ప్రాంతాన్ని నిన్న తాకాయి. మూడు రోజుల ముందుగానే ఇవి వచ్చాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే నాలుగు రోజుల్లోపు కేరళలోకి ప్రవేశిస్తాయని, ఆ సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మే 31 నుంచి జూన్ 6 వరకు మధ్య భారత ప్రాంతాల్లో మంచి వర్షాలు పడతాయని అంచనా వేసింది. అనుకూల పరిస్థితుల ఆధారంగా జూన్ నెలలో మొదటి రెండు వారాల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అక్కడి నుంచి రుతుపవనాలు జూన్ 14 నాటికి మధ్య భారతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరిస్తాయని వాతావరణ శాఖ తన తాజా నివేదికలో వివరించింది.
జూన్ 1-7 మధ్య లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులు, కేరళ, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం ఉంటుందని పేర్కొన్నారు.