ipl: ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు భారత పౌరసత్వం ఇవ్వండి!: సుష్మాకు నెటిజన్ల సూచన
- ఐపీఎల్ లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచిన రషీద్ ఖాన్ పై ప్రశంసలు
- రషీద్ కు భారత పౌరసత్వ మివ్వాలంటూ మంత్రికి ట్వీట్లు
- కేంద్ర హోం శాఖ చూసుకుంటుందని బదులిచ్చిన సుష్మా స్వరాజ్
ఐపీఎల్ ఫైనల్ కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, రషీద్ ఖాన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచిన రషీద్ ఖాన్ వల్లే ఫైనల్ కు చేరామంటూ పలువురు క్రికెటర్లు, అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే సమయంలో, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ కు భారత పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు అభిమానులు పలు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లపై సుష్మా స్వరాజ్ స్పందించారు. ‘మీ అందరి ట్వీట్లు చూశాను. పౌరసత్వానికి సంబంధించి కేంద్ర హోం శాఖ చూసుకుంటుంది’ అని సుష్మా బదులిచ్చారు.
కాగా, బీసీసీఐకు అభిమానులు ఆసక్తికర సలహా కూడా చేశారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ సంప్రదింపులు జరిపి, రషీద్ ఖాన్ ని మనం తీసుకుని, అతని స్థానంలో రవీంద్ర జడేజాను ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుకు ఇవ్వాలని సరదాగా సూచించారు.