Tamilnadu: 'అది నాకు మామూలే'... డాక్టర్లతో జయలలిత... ఆడియోను విడుదల చేసిన విచారణ కమిటీ!

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత మాట్లాడిన మాటల ఆడియో విడుదల
  • డాక్టర్లతో జోకులు వేసిన జయలలిత
  • ప్రజల దృష్టిని మళ్లించేందుకేనన్న స్టాలిన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, తాను అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో క్లిప్ లను, ఆమె మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ విడుదల చేసింది. సుమారు 1.07 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్‌లో 'మీకు రక్తపోటు ఎక్కువగా ఉంది. సిస్టోలిక్‌ పీడనం 140గా ఉంది' అని జయలలితకు డ్యూటీలో ఉన్న డాక్టర్‌ చెప్పగా, ఆమె, 'డయాస్టోలిక్‌ ప్రెజర్ ఎంతుంది?' అని ప్రశ్నించారు. దీనికి డాక్టర్ 140/80 ఉంది అని సమాధానం చెప్పగా, 'అయితే అది నాకు మామూలే' అని జయలలిత వ్యాఖ్యానించారు. ఆపై తనకు ఎదురవుతున్న సమస్యను కేఎస్‌ శివకుమార్‌ అనే డాక్టరుకు వివరిస్తూ, ఊపిరి తీసుకుంటుంటే గురక వంటి శబ్దం వస్తోంది. ఇది సినిమాలో ఫ్యాన్స్ వేసే విజిల్ లా ఉంటుందని జయలలిత జోక్ వేశారు.

మరో ఆడియో టేప్ లో, గతంతో పోలిస్తే, శ్వాస తీసుకుంటున్నప్పుడు వస్తున్న శబ్దం తీవ్రత తగ్గిందని డ్యూటీ డాక్టర్ జయలలితకు చెప్పడం వినిపిస్తోంది. దీనికి ఆమె సమాధానం ఇస్తూ, తన గురక ఎక్కువగా ఉన్నప్పుడు, రికార్డు చేసేందుకు ఓ యాప్ ను మొబైల్ లో డౌన్‌ లోడ్‌ చేయమని చెబితే, మీరు కుదరదని అన్నారంటూ చమత్కరించారు. హాస్పిటల్ లో జయలలిత మెనూకు సంబంధించిన లిస్టును కూడా ఈ కమిషన్‌ బహిర్గతం చేసింది.

ఇదిలావుండగా, తూత్తుకుడి కాల్పుల ఘటనలు, అక్కడ ప్రాణాలు కోల్పోయిన అమాయకులను గాలికి వదిలి, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ఆడియో క్లిప్పులను ప్రభుత్వం విడుదల చేయించిందని ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ఆరోపించారు.

  • Loading...

More Telugu News