Paytm: కొత్త వివాదం... యూజర్ల డేటాను లీక్ చేసిన పేటీఎం!
- పీఎంఓ కోరిక మేరకు డేటాను లీక్ చేసిన పేటీఎం
- స్వయంగా వెల్లడించిన వైస్ ప్రెసిడెంట్ అజయ్ శర్మ
- 'కోబ్రా పోస్ట్' స్టింగ్ ఆపరేషన్
డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ పేటీఎం మరో వివాదంలో చిక్కుకుంది. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు, తన యూజర్ల డేటాను లీక్ చేసిందని 'కోబ్రా పోస్ట్' మీడియా సంస్థ వెల్లడించింది,. పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మతో జరిపిన సంభాషణ వివరాల వీడియో క్లిప్ ను 'కోబ్రా పోస్ట్' విడుదల చేయగా, అందులో కశ్మీర్ లో నిరసనకారులు రాళ్ల దాడికి దిగుతున్న సమయంలో పీఎంఓ నుంచి తమకు ఓ ఫోన్ వచ్చిందని, శ్రీనగర్ తో పాటు కశ్మీర్ లోని పట్టణాల్లో పేటీఎం సేవలను వినియోగించుకుంటున్న వారి వివరాలను కోరారని, తాము అందించామని అజయ్ శర్మ వ్యాఖ్యానించారు.
అండర్ కవర్ రిపోర్టర్ పుష్ప శర్మను అజయ్ వద్దకు పంపిన 'కోబ్రా పోస్ట్', తాము ఆర్ఎస్ఎస్ అనుబంధ సమితి నుంచి వచ్చామని, రామాయణాన్ని, భగవద్గీతను ప్రచారం చేసేందుకు ఓ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెబుతూ సంప్రదించింది. ఇక అజయ్ శేఖర్, ఎన్నో వివరాలను పుష్పతో పంచుకున్నారు. కాగా, డేటా లీక్ ఆరోపణలపై పేటీఎం స్పందిస్తూ, తాము ఇంతవరకూ థర్డ్ పార్టీకి కస్టమర్ల డేటాను ఇవ్వలేదని స్పష్టం చేయడం గమనార్హం.