national highways: ఇక హైవేలపై కార్లకు అదుపే లేదు... గంటకు 100-120 వేగంతో వెళ్లొచ్చు!
- ద్విచక్ర వాహనాలకు 80 కిలోమీటర్ల పరిమితి
- ట్రక్కులు, బస్సులకు 80-90 కిలోమీటర్లు
- ప్రతిపాదనలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం
- త్వరలోనే నోటిఫికేషన్
జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ హైవేలపై అతి త్వరలోనే వేగ పరిమితిని పెంచనున్నారు. జాతీయ రహదారులపై కార్లు గంటకు 80 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లేందుకు ప్రస్తుతం అనుమతి ఉండగా, దాన్ని 100 కిలోమీటర్లకు, ఎక్స్ ప్రెస్ హైవేలపై 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. మంత్రి నితిన్ గడ్కరీ ఇందుకు ఆమోదం తెలియజేయగా, నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.
వేగ పరిమితిని పెంచుతూ భద్రత విషయంలో రాజీ పడకూడదని ఉపరితల రవాణా శాఖ నిర్ణయించింది. అనుమతించిన వేగానికి మించి ప్రయాణించకుండా చూసేందుకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ద్విచక్ర వాహనాలు సైతం జాతీయ రహదారులపై 80 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితితో వెళ్లొచ్చు. ట్రక్కులు, బస్సులకు జాతీయ రహదారులపై గరిష్ట వేగ పరిమితి 80 కిలోమీటర్లు, ఎక్స్ ప్రెస్ హైవేలపై 90 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇక రాష్ట్రాల్లోని రహదారులపై వేగ పరిమితిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారానికి విడిచిపెట్టారు.