Rahul Gandhi: రాహుల్ గాంధీ మార్క్... ఏపీ నుంచి దిగ్విజయ్ సింగ్ కు టాటా!
- ఉమెన్ చాందీని నియమించిన రాహుల్
- కేరళకు సీఎంగా పనిచేసిన చాందీ
- కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ ను తొలగించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఏపీ వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం నియమించినట్టు రాహుల్ కార్యాలయం ఈ ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది.
2014లో రాష్ట్రం విడిపోకముందు నుంచి దిగ్విజయ్ సింగ్ ఈ పదవిలో ఉండగా, ఆయన్ను తెలంగాణకు దూరం చేస్తూ, ఇటీవలే ఆ రాష్ట్రానికి కుంతియాను ఇన్ చార్జ్ గా కాంగ్రెస్ నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏపీ పదవి నుంచి కూడా ఆయన్ను తొలగించారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో దిగ్విజయ్ అవసరం ఎక్కువగా ఉందని భావించిన రాహుల్, ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇటీవల కర్ణాటకలో బీజేపీని అధికారానికి దూరం చేసిన కాంగ్రెస్, ఆ క్రెడిట్ మొత్తాన్ని రాహుల్ కు ఇస్తుండగా, త్వరలో ఎన్నికలు జరిగే రాజస్థాన్ సహా, బీహార్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కీలక సంస్థాగత మార్పులను రాహుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.