STERLITE: కుదుటపడ్డ తూత్తుకుడి... 144 సెక్షన్ తొలగింపు!
- గడిచిన 24 గంటల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు
- పట్టణం, జిల్లాలో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి
- జిల్లా కలెక్టన్ సందీప్ నండూరి ప్రకటన
స్టెరిలైట్ కాపర్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా ఆందోళనలతో అట్టుడుకిపోయిన తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలో పరిస్థితులు సద్దుమణిగాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోవడం, 103 మంది వరకు గాయపడిన విషయం గమనార్హం. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ఏర్పాటుపై మద్రాస్ హైకోర్టు స్టే కూడా జారీ చేసింది. అయితే, గడిచిన 24 గంటల్లో హింస జరిగినట్టు ఎటువంటి సమాచారం లేదని జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి తెలిపారు.
‘‘పట్టణంలోనూ, జిల్లాలోనూ సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడ్డాయి. గత 24 గంటల్లో అవాంఛనీయ ఘటన ఒక్కటీ జరగలేదు. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఘటనలపై సమాచారం రాగా, వాటిని సమీక్షిస్తున్నాం’’ అని కలెక్టర్ సందీప్ వెల్లడించారు. ఇక, సాధారణ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ ను ఎత్తివేశారు.