srikakulam: ఉత్తరాంధ్రలో ఎక్కడికి వెళ్లినా కన్నీటి గాథలే: పవన్ కల్యాణ్
- టీడీపీ ఉమ్మడిగా తిని, ఒంటరిగా బలవాలనుకుంటోంది
- ‘జనసేన’ సైనికుల వల్లే ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది
- ‘ప్రత్యేక హోదా’కు సంబంధించి ‘ఇక మాటలు లేవు..చేతలే’
ఉత్తరాంధ్రలో ఎక్కడికెళ్లినా కన్నీటి గాథలేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో పవన్ కల్యాణ్ పోరాటయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఉమ్మడిగా తిని, ఒంటరిగా బలవాలనుకుంటోందని, ‘జనసేన’ సైనికుల వల్లే ఈరోజు టీడీపీ అధికారంలో ఉందని అన్నారు.
తాను బస చేసే ప్రాంతంలో కరెంట్ కట్ చేయించి, తనపై దాడులకు యత్నిస్తున్నారని ఆరోపించిన పవన్, అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకివ్వదంటూ కేంద్రం తీరును ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నిలబెట్టుకోవాలని, హామీలు నెరవేర్చకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని, నాలుగేళ్లలో 36 సార్లు మాటమార్చాని, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధనకు సంబంధించి ‘ఇక మాటలు లేవు..చేతలే’ అని హెచ్చరించారు.