Chandrababu: ఇచ్చిన దానికి లెక్కలు చెప్పనప్పుడు మేమెందుకు నిధులివ్వాలి?: చంద్రబాబుకు అమిత్ షా సూటి ప్రశ్న
- ఇంతవరకూ ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పలేదు
- చంద్రబాబు స్వీయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు కావు
- మీడియాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇంతవరకూ తామిచ్చిన నిధుల్లో ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పని చంద్రబాబుకు, మరిన్ని నిధులు ఎందుకు ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి పటం, ఇప్పటికీ సింగపూర్ ను దాటి బయటకు రాలేదని విమర్శించిన ఆయన, చంద్రబాబుకు గుజరాత్ లో అభివృద్ధి చెందిన నగరాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గుజరాత్ నగరాలన్నీ రాష్ట్ర నిధులతోనే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. కేంద్రం నుంచి నగరాల నిర్మాణానికి గుజరాత్ సర్కార్ ఎన్నడూ డబ్బులు తీసుకోలేదని అన్నారు.
ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 2,100 కోట్లను ఇచ్చిందని, వాటి లెక్కలు ఇంతవరకూ కేంద్రానికి చేరలేదని, ఆ పరిస్థితుల్లో మరిన్ని డబ్బులు ఎలా ఇస్తారని అడిగారు. ఒక్క భవన నిర్మాణానికైనా టెండర్లు పిలిచారా? అని అమిత్ షా ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే స్వీయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు కావని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించిన ఆయన, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీకి ఎటువంటి నష్టమూ లేదని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లనున్నామని, కొత్త మిత్రపక్షాలేమీ ఉండబోవని అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి గురించి, నిజానిజాలను గురించి ప్రజలకు, మీడియాకు అర్థమయ్యేలా వివరించడం తప్ప తమ ముందు పెద్దగా సవాళ్లేమీ లేవని అన్నారు.