Madhya Pradesh: విడాకులు ఇచ్చినా సరే... జీతం వివరాలు భార్యకు చెప్పాల్సిందే: మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

  • విడాకుల తరువాత రూ. 7 వేలు భరణంగా ఇస్తున్న భర్త
  • చాలడం లేదంటూ కోర్టును ఆశ్రయించిన భార్య
  • జీతం వివరాలు చెప్పాల్సిందేనన్న న్యాయస్థానం

భార్యకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నా, తనకు వచ్చే జీతభత్యాల వివరాలను ఆమెకు చెప్పాల్సిందేనని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆసక్తికరమైన ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ లో అధికారిగా పనిచేస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తి, తన భార్య సునీతా జైన్ కు విడాకులు ఇచ్చాడు. ఆపై కోర్టు ఆదేశాల మేరకు నెలకు రూ. 7 వేలు భరణం చెల్లిస్తుండగా, అది తనకు సరిపోవడం లేదని, అసలు అతనికి ఎంత వేతనం వస్తుందో తెలియజేయాలని సునీతా జైన్ మహిళా కోర్టులో కేసు వేశారు.

కేసును విచారించిన న్యాయస్థానం సునీత పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఆమె సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని, తన మాజీ భర్త జీతభత్యాల వివరాలు చెప్పాలని బీఎస్ఎన్ఎల్ కు దరఖాస్తు చేశారు. ఆమె కోరిక మేరకు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన ధర్మాసనం, జీతం వివరాలు మాజీ భార్యే అయినా, ఆమెకు తెలియాల్సిందేనని, విడాకులు ఇచ్చినంత మాత్రాన, వివరాలు ఇవ్వకుండా అడ్డుకోలేరని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News