Bihar: భూకంపం వస్తుందన్న భయంతో తొక్కిసలాట... బీహార్ రైల్వే స్టేషన్ లో 100 మంది విద్యార్థులకు గాయాలు!
- ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు బయలుదేరిన 6 వేల మంది విద్యార్థులు
- భూకంపం వస్తోందని కేకలు పెట్టిన ఓ విద్యార్థి
- తొక్కిసలాట - గాయపడిన వారిలో 58 మంది పరిస్థితి విషమం
ఇదో దిగ్భ్రాంతి కలిగించే ఘటన. బీహార్ లోని బీహార్ షరీఫ్ రైల్వే స్టేషన్ లో భూకంపం వస్తుందన్న వదంతులు వ్యాపించడంతో తొక్కిసలాట జరిగి 100 మంది విద్యార్థులు గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. 'ప్రభాత్ కబర్' పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం నాడు ఐటీఐ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ రాసేందుకు బయలుదేరి వచ్చిన 6 వేల మంది విద్యార్థులు రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న సమయంలో ఓ విద్యార్థి భూకంపం వస్తోందని అరుస్తూ, పరుగులు ప్రారంభించాడు.
దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిలో 58 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. వీరికి సమీపంలోని సివిల్ హాస్పిటల్ లో చికిత్సను అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారికి చికిత్స చేసి పంపించామని అధికారులు తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారని అన్నారు.