purandeswari: ఎన్టీఆర్ గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు: పురందేశ్వరి
- ఎన్టీఆర్ కు సంబంధించిన అన్ని విషయాలు తెలుగువారందరికీ తెలుసు
- ఆయన జయంతి తెలుగు జాతి పండుగలా జరపాలి
- పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ చరిత్రను చేర్చాలి
దివంగత ఎన్టీఆర్ గురించి తాను కొత్తగా చెప్పేదేమీ లేదని ఆయన కుమార్తె, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగు ప్రజలకు తెలుసని చెప్పారు. తెలుగువారిని కూడా మదరాసీలుగా పిలుస్తున్న కాలంలో... తెలుగువారికి కూడా ప్రత్యేక చరిత్ర ఉందని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ 95వ జయంతి సందర్భంగా భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలసి... ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.
ఎన్టీఆర్ జయంతి అయిన మే 28వ తేదీని తెలుగుదేశం పార్టీ పండుగలా కాకుండా, తెలుగు జాతి పండుగలా జరపాలని ఈ సందర్భంగా పురందేశ్వరి కోరారు. ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవితచరిత్రను చేర్చాలని హరికృష్ణ కోరడంలో తప్పులేదని అన్నారు. మహానాడులో ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాలకృష్ణలు ఉంటే బాగుండేదని చెప్పారు. అయితే, మహానాడు తొలిరోజైన నిన్న కొన్ని కారణాల వల్ల హాజరుకాలేని బాలయ్య... ఈ ఉదయమే సభాప్రాంగణానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.